జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వారాహి విజయయాత్ర విశాఖలో గురువారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నెల 17 వరకు కొనసాగనున్న యాత్ర షెడ్యూల్‌ను పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటనను విడుదల చేశారు. జగదాంబ కూడలిలో జరిగిన బహిరంగ సభ విజయవంతంపై నేతలను ఆయన అభినందించారు. విశాఖ(Vizag) పరిధిలో పవన్ కళ్యాణ్ చేపట్టే కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని స్పష్టం చేశారు.
వారాహి విజయ యాత్ర షెడ్యూల్ వివరాలు..
12న ఉదయం 11 గంటలకు పెందుర్తి నియోజకవర్గానికి వెళ్తారు. వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్దురాలు వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శ. అదే రోజు సాయంత్రం 4 గంటలకు విశాఖ నగరంలో సీఎన్‌బీసీ ల్యాండ్స్ ప్రాంతం సందర్శన
• 13న గాజువాక నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో పవన్ పాల్గొననున్నారు.
• 14న ఉదయం 11 గంటలకు అనకాపల్లి నియోజకవర్గ పరిధిలోని విస్సన్నపేటకు ఆక్రమణకు గురైన భూముల సందర్శన
• 15న మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరు
• 16న విశాఖ నగరం భీమిలి నియోజకవర్గంలో ధ్వంసానికి గురవుతున్న ఎర్రమట్టి దిబ్బల సందర్శన
• 17న విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనవాణి కార్యక్రమం
మరోవైపు పవన్ కల్యాణ్(Pawan Kalyan)కు విశాఖ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వారాహి విజయయాత్రలో భాగంగా జగదాంబ సెంటర్‌లో జరిగిన సభలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ విశాఖ తూర్పు ఏసీపీ మూర్తి నోటీసుల్లో పేర్కొన్నారు. బహిరంగ సభలో పవన్ నిబంధనలు ఉల్లంఘించారని, సభల్లో బాధ్యతగా మాట్లాడాలని తెలిపారు. వాలంటీర్లు, ఆంధ్రా యూనివర్సిటీపై ఆరోపణలు చేసినందకు గాను సెక్షన్ 30 కింద నోటీసులు జారీచేశామని తెలిపారు.