PM Modi phone call to YS Sharmila: గుజరాత్ ఎన్నికలు ముగియడంతో ఇతర రాష్ట్రాల్లో పాగా వేసేందుకు భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది. తెలంగాణలో బీజేపీ పట్టు బలపడుతున్న నేపథ్యంలో ఏపీలోనూ పట్టు సాధించేందుకు ఫోకస్ పెట్టింది. ఏకకాలంలో ఉభయ తెలుగు రాష్ట్రాలపై ప్రధాని మోడీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు కమలం అధిష్టానం వ్యూహాలకు పదును పెడుతోంది.
ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలను కేంద్ర ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. మారుతున్న రాజకీయ సమీకరణాలు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అనుగుణంగా కాషాయదళం అడుగులు వేస్తోంది. తెలుగు రాష్ట్రాలను తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ప్రత్యేక మిషన్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్టు రాజకీయ వర్గాల్లో చర్చలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోడీ సోమవారం ఢిల్లీలో వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు, వైఎస్సార్ తనయ షర్మిల గురించి ప్రస్తావించడం విశేషం.
షర్మిలను కారులో ఉండగానే తెలంగాణ పోలీసులు క్రేన్ ద్వారా తరలించిన ఉదంతం గురించి ఏపీ సీఎం, షర్మిల సోదరుడైన జగన్ మోహన్ రెడ్డిని వాకబు చేసినట్లు తెలుస్తోంది. నేడు స్వయంగా మోడీనే షర్మిలకు ఫోన్ చేసి దాదాపు 10 నిమిషాల పాటు సంభాషించారు(PM Modi phone call to YS Sharmila). తెలంగాణాలో రాజకీయాలు, ఆమెపై జరిగిన దాడుల గురించి చర్చించిన ప్రధాని.. ఆమెను ఢిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఇక ఎప్పటి నుండో షర్మిల బీజేపీ వదిలిన బాణం అనే విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, షర్మిలతో మోదీ ప్రత్యేకంగా భేటీ అవనున్నారనే అంశం ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.
ఇక షర్మిల ద్వారా ఏపీలో కూడా బీజేపీ లబ్ది పొందే కార్యాచరణ మొదలుపెట్టనుందా అనే కొత్త చర్చ సైతం రాజకీయ వర్గాల్లో మొదలైంది. మోడీనే స్వయంగా ఉభయ రాష్ట్రాల్లో ఆపరేషన్ లోటస్ మొదలుపెట్టారా? రానున్న రోజుల్లో మోడీ మిషన్ మరింత ఉధృతంగా కొనసాగనుందా? తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ మరింత బలపడనుందా? అనే ప్రశ్నలు జోరందుకున్నాయి. ఇవన్నీ తేలాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.