వైసీపీ(YCP)లో అభ్యర్థుల మార్పు రోజురోజుకు కాక రేపుతోంది. టికెట్ రాని అభ్యర్థులు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా సీఎం జగన్(Jagan)పైనే ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పూతలపట్టు(Puthalapattu) ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు(MLA MS Babu) తన ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా బీసీ.. నా ఎస్సీ.. నా ఎస్టీ’ అనే జగన్.. దళితుల పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ పెద్దలు, మంత్రులు చెప్పినట్టే నడుచుకున్నానని.. ఇప్పుడు తనపై వ్యతిరేకత ఉంటే ఎవరిది బాధ్యత? ఐదేళ్లలో సీఎం జగన్ ఒక్కసారి కూడా తమను పిలిచి మాట్లాడలేదని వాపోయారు.
కేవలం దళిత నియోజకవర్గంలోని ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదంటూ ఎందుకు టికెట్ ఇవ్వకుండా నిరాకరిస్తున్నారని తెలిపారు. ఓసీలను ఎందుకు మార్చడం లేదని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో ఐప్యాక్ సర్వేల ద్వారానే టికెట్లు ఇచ్చారా? పార్టీ కోసం కుటుంబాన్ని వ్యాపారాన్ని అన్ని వదులుకొని ఐదేళ్లు పార్టీ, ప్రజాసేవలో లీనమైపోయాయని పేర్కొన్నారు. డబ్బులు ఇస్తే ఐప్యాక్ వాళ్ళు సర్వే ఫలితాలు ఎలాగైనా మారుస్తారన్నారని ఆరోపించారు. పార్టీలో టికెట్ల విషయంలో దళితులకు అన్యాయం జరుగుతోందన్నారు. అయితే తాను పార్టీలోనే కొనసాగుతానని తనకు జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందని ఆయన వెల్లడించారు. అయితే పార్టీలోనే ఉంటానని చెప్పి విమర్శలు చేయడం ఆసక్తికరంగా మారింది.