సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్‌ను అరెస్ట్ చేయడంపై టీడీపీ ఎమ్మెల్యే, ఆంధ్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు(Raghu Rama Krishna Raju) సంతోషం వ్యక్తం చేశారు. విజయ్ ఎన్నో దందాలు విజయవంతంగా చేరశారంటూ విమర్శలు చేశారు. ఆయన పాపం పండిందని, అందుకే ఇప్పుడు అరెస్ట్ అయ్యారంటూ మండిపడ్డారు. ఏమి అడిగినా పోలీసులకు తెలియదు అనే కరుడుగట్టిన క్రిమినల్ మాదిరిగా సమాధానం చెప్తున్నారని తెలిసిందని, తనను కస్టడీలోకి తీసుకుని చిత్రవధకు గురి చేసిన వారిలో విజయ్(ASP Vijay Paul) కూడా ఒకరంటూ రఘురామ చెప్పుకొచ్చారు. తనపై అసలు కుట్ర చేసింది పీవీ సునీల్ కుమార్ అని కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘నన్ను కస్టోడియల్ టార్చర్ చేసిన వారిలో కీలక నిందితుడు విజయ్ పాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అందరూ కలిసి కుట్ర చేశారు. ఇప్పటికే ఆలస్యం అయ్యింది. పీవీ సునీల్ కుమార్ ప్రధాన నిందితుడు. ఆయన తులసి వనంలో గంజాయి మొక్క లాంటి వారు. పీవీ సునీల్ కుమార్(Sunil Kumar) కి లుక్ ఔట్ నోటీసులు ఇవ్వాలి. అంతేకాకుండా ఆయన దేశం విడిచి పారిపోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర పోలీసులపై ఉంది. సునీల్ కుమార్, విజయ్ పాల్ అంతా ఒకే ముఠా. నన్ను టార్చర్ చేసిన వారికి న్యాయస్థానంలో తప్పకుండా శిక్షపడుతుందన్న నమ్మకం ఉంది. A5గా హాస్పటల్ సూపర్ డెంట్ డాక్టర్ ప్రభావతి పేరును కూడా ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశా. మెడికల్ రిపోర్ట్ కూడా అప్పుడు ఇవ్వలేదు. ఈ కేసులో అందరిని శిక్షించడానికి ఎక్కువ సమయం పట్టదు’’ అని Raghu Rama Krishna Raju చెప్పుకొచ్చారు.