మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)కి ఈ మధ్య కాలంలో బీజేపీ పెద్దలు ఎనలేని ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఏపీలో అల్లూరి సీతారామరాజు విగ్రహం ఏర్పాటు సభలో చిరుకు ప్రధాని మోదీ ప్రాధాన్యత ఇవ్వడం, ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022గా ప్రకటించడం, అయోధ్య రామమందిరానికి ఆహ్వానించడం, ఇటీవల పద్మవిభూషణ్ పురస్కారం ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఈ పరిణామాలన్నింటిని గమనిస్తే పక్కా ప్రణాళిక ప్రకారమే మోదీ.. చిరంజీవికి ప్రాధాన్యత ఇస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాపులను ఆకట్టుకునే దిశగా..
ముఖ్యంగా ఏపీలో రాజకీయంగా బలపడటానికి ప్రయత్నాలు చేస్తు్న్నారు. ఇందులో భాగంగానే బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన చిరంజీవిని దగ్గరికి తీస్తే ఆ సామాజికవర్గం మెప్పు పొందవచ్చని ఆలోచనలో ఉన్నారు. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టీడీపీ(TDP) నుంచి బయటకు తీసుకొచ్చి తమతోనే పొత్తు పెట్టుకునేలా వ్యూహాలు రూపొందిస్తు్న్నారు. వీటిలో భాగంగానే పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించడం.. తాజాగా పెద్దల సభ రాజ్యసభకు చిరంజీవిని పంపించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో ఆఫర్‌ను తిరస్కరించిన చిరు..
గతంలోనే రాష్ట్రపతి కోటాలోనే చిరును రాజ్యసభకు నామినేట్ చేయాలని చూశారు. కానీ ఈ ఆఫర్‌ను ఆయన సున్నితంగా తిరస్కరించనట్టు సమాచారం. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి రాజమౌళి తండ్రి ప్రముఖ రచయత విజయేంద్ర ప్రసాద్‌ను పెద్దల సభకు నామినేట్ చేశారు. దీంతో త్వరలోనే 15 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 56 మంది రాజ్యసభ సభ్యుల ఎంపికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే..
యూపీ(Uttar Pradesh)లో ఖాళీగా ఉన్న 10 స్థానాలను గెలుచుకునే బలం బీజేపీకి ఉంది. అందుకే ఇక్కడి నుంచి చిరంజీవిని రాజ్యసభకు నామినేట్ చేయాలని చూస్తున్నారని సమాచారం. అలాగే త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రివర్గంలోకి చిరును తీసుకోనున్నట్లు కూడా చెబుతున్నారు. మరి గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన చిరంజీవి(Chiranjeevi) కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పూర్తిగా సినిమాలపై దృష్టి పెట్టారు. అయినా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ ఆఫర్‌ను స్వాగతిస్తారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.