వైసీపీకి మరో షాక్ తగిలింది. సీఎం జగన్ సన్నిహితుడు, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామంచంద్రారెడ్డి(Kapu Ramachandra Reddy) పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జగన్‌ను గుడ్డిగా నమ్మితే.. నమ్మించి గొంతు కోశారని ఆరోపించారు. సర్వేల పేరుతో తనకు టిక్కెట్ లేకుండా చేశారని మండిపడ్డారు. కనీసం జగన్‌ను కలిసేందుకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ఇంతకంటే మరో అవమానం ఉండదన్నారు. ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ తరపున లేదంటే స్వతంత్ర అభ్యర్థులుగా రాయదుర్గం, కళ్యాణదుర్గం నుంచి తాను, తన భార్య పోటీ చేస్తామని తేల్చిచెప్పారు.
జగన్(YS Jagan) ఏం చెబితే అది చేశామని.. ఎంతో కష్టపడి పని చేశామన్నారు.. మంచి జరిగినా.. చెడు జరిగినా ముఖ్యమంత్రి జగన్ వల్లే అన్నారు. అలాంటి పరిస్థితుల్లో తమను పిలిచి సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) సర్వే రిపోర్టు బాగోలేదని, నీకు టికెట్ లేదని చెప్పడం నాకు చాలా బాధకరంగా ఉందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి ఎప్పుడు ఏ నేత పార్టీకి రాజీనామా చేస్తారో తెలియని సందిగ్థత వైసీపీలో నెలకొంది. అభ్యర్థుల మార్పులు చేర్పులు ఆ పార్టీలో పెద్ద దుమారమే రేపుతున్నాయి.