Tirupati | తెలుగు రాష్ట్రాలు ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలకు సిద్ధం అవుతున్నాయి. డిసెంబర్ 31 న సెలబ్రేషన్స్ హోరెత్తించాలని కుర్రకారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పబ్బులు, క్లబ్బులు యువతని ఆకట్టుకునేందుకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇక వైన్ షాపులన్నీ కొత్త సరుకుతో కళకళలాడుతున్నాయి. అయితే పుణ్యక్షేత్రాలు ఉన్న ప్రాంతాలలో మాత్రం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటూ అడ్డగోలుగా వ్యవహరిస్తే మాత్రం సహించేది లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఈ క్రమంలో కొత్త సంవత్సరం వేళ తిరుమల తిరుపతిలో పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31న జిల్లా(Tirupati) వ్యాప్తంగా చెక్ పోస్ట్ లు, పికెట్లను ఏర్పాటు చేసి రాత్రి 10:00 నుంచి వాహనాల తనిఖీలు చేస్తామని వెల్లడించారు. తిరుపతిలోని గరుడవారధి, యూనివర్సిటీ ఫ్లైఓవర్లను రాత్రి పది గంటలకే మూసివేస్తామన్నారు. అశ్లీల నృత్యాలు, డీజేలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.