విశాఖపట్నంలోని రుషికొండ బీచ్(Rushikonda Beach) తన ప్రతిష్టాత్మకమైన ‘బ్లూ ఫ్లాగ్’ గుర్తింపును కోల్పోయింది. బీచ్ నిర్వహణ సరిగా లేకపోవడంతోనే డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ (FEE) సంస్థ ఆ గుర్తింపును రద్దు చేసినట్లు తెలుస్తోంది. రుషికొండ బీచ్ 2020లో బ్లూ ఫ్లాగ్ గుర్తింపును పొంది రాష్ట్రంలో FEE సంస్థ గుర్తింపు పొందిన ఏకైక బీచ్‌గా నిలిచింది.
కాగా, ఈ సర్టిఫికెట్ దక్కాలంటే బీచ్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించబడేది అయ్యుండాలి. పరిసరాలు శుభ్రంగా ఉంచాలి. భద్రత, పర్యావరణ నిర్వహణ, నీటి నాణ్యతతో పాటు సరైన మౌలిక సదుపాయాలు ఉండాలి వంటి కొన్ని నియమాలను FEE విధించింది.
అయితే, కొన్ని రోజుల క్రితం రుషికొండ బీచ్ నిబంధనల ప్రకారం నిర్వహణ జరగడం లేదని FEEకి తెలియని వర్గాల నుండి ఫిర్యాదులు అందాయి. బీచ్ చెత్తతో నిండిపోయి ఉండటం, కుక్కలు, పనిచేయని CCTVలు, పనికిరాని టాయిలెట్లు, దుస్తులు మార్చుకునే గదుల ఫోటో ప్రూఫ్ లను ఫిర్యాదుదారు తన కంప్లైంట్ లో జత చేశారు. ఫిర్యాదుపై స్పందిస్తూ… రుషికొండ బీచ్(Rushikonda Beach) కి బ్లూ ఫ్లాగ్ గుర్తింపును తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు పేర్కొంటూ FEE విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌కు ఒక మెయిల్ పంపింది. బీచ్ చుట్టూ ఎగురవేసిన గుర్తింపు జెండాలను కూడా తొలగించాలని అధికారులను ఆదేశించింది.
కాగా, మార్చి 4న భద్రతా ఆడిట్ తర్వాత బ్లూ ఫ్లాగ్‌ను పునరుద్ధరించే అవకాశం ఉందని జిల్లా అధికారులు చెబుతున్నారు. నివేదికల ప్రకారం, రాష్ట్రంలో పర్యాటక శాఖ అధికారుల మధ్య సమన్వయ లోపం ఈ పరిస్థితికి దారితీసిందని తెలుస్తోంది. మరోవైపు బీచ్ నిర్వహణ కోసం ప్రైవేట్ సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడం కూడా ఒక కారణమని చర్చ నడుస్తోంది. కాగా, మార్చి 1 వరకు ఈ విషయం బయటకు రాకుండా జిల్లా అధికారులు జాగ్రత్తపడ్డారు. జెండాలను కూడా తొలగించలేదు. బ్లూ ఫ్లాగ్ గుర్తింపు(Blue Flag Status) రద్దు విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత వెలుగులోకి వచ్చింది.