కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల(YS Sharmila) చేరికపై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరటం వెనక టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) హస్తం ఉందని ఆరోపించారు. అయినా ఆమె వల్ల వైసీపీకి వచ్చే నష్టమే లేదని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ పరంగా షర్మిలకు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేసే హక్కు ఉందన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని.. అలాంటి పార్టీని తాము పట్టించుకోల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
అలాగే అంగన్ వాడీల సమ్మెపై ఎస్మా(Esma) ప్రయోగించడాన్ని ఆయన సమర్ధించుకున్నారు. అంగన్ వాడీ పాఠశాలల్లో చిన్నపిల్లలు, గర్భిణీలు చాలా ఇబ్బంది పడుతున్నారని.. వాళ్ల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు. అత్యవసర సర్వీసుల కింద అంగన్ వాడీలు ఉన్నారని.. విధుల్లో చేరాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. అందుకే ప్రభుత్వం ఆదేశాలను ధిక్కరించినందుకు ఎస్మా చట్టాన్ని ప్రయోగించామని సజ్జల(Sajjala Ramakrishna Reddy) వెల్లడించారు.