Tirumala Laddu Row | తిరుమల తిరుపతి లడ్డూ వివాదంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం ఇందులో నిజానిజాలు తేల్చాలని, లడ్డూ వివాదం నిగ్గు తేల్చాలని అనేక మంది డిమాండ్ చేస్తున్నారు. విపక్ష నేత వైఎస్ జగన్ కూడా ఇదే వ్యవహారంపై ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. బీజేపీ సీనియర్ నేత సుబ్రమణియన్ స్వామి, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సహా పలువురు న్యాయవాదులు కూడా ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. తిరుపతి లడ్డూ వ్యవహారం ఒక రాష్ట్రానికో, రెండు పార్టీలకో చెందినది కాదని, కోట్ల మంది భక్తుల మనోభావాలకు చెందిన అంశం కావడంతో యుద్ధప్రాతిపదిక సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. అదే విధంగా సిట్టింగ్ జడ్జి లేదా రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టాలని కోరుతున్నారు. కాగా ఈ వివాదంపై దర్యాప్తు చేయడానికి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(SIT)ని ఏర్పాటు చేసింది.
Tirumala Laddu Row | తిరుమలలో వినియోగించిన ఆవు నెయ్యిలో చంద్రబాబు ఆరోపించినట్లు జంతువుల కొవ్వు, చేప నూనె వంటివి కలిశాయా లేదా అన్న అంశం నిగ్గు తేల్చే బాధ్యతలను ఎస్‌ఐటీ భుజాలపై మోపింది ప్రభుత్వం. ఈ సిట్ టీమ్‌కు చీఫ్‌గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ సిట్ బృందంలో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్దన్ రాజు సహా డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు కూడా ఉండనున్నారు. వీరంతా కలిసి తమ దర్యాప్తు పూర్తయిన వెంటనే తిరుమల నెయ్యి నాణ్యతపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించనుంది. ఆ నివేదిక ప్రకారమే తాము తదుపరి చర్యలు తీసుకోనున్నామని ప్రభుత్వం తెలిపింది.