తన కాంగ్రెస్ పర్యటనలో భాగంగా టెక్సాస్ యూనివర్సిటీ విద్యార్థులతో కాంగ్రెస్ అగ్రనే రాహుల్ గాంధీ(Rahul Gandhi) మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన.. భారత్‌లో కొనసాగుతున్న భాష వివాదాన్ని ప్రస్తావించారు. ప్రతి భాషకు ఒక ప్రత్యేక ఉంటుందని, ఒక భాష గొప్పది, ఒక భాష చిన్నది అన్న బేధం ఉండకూడదన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు భాషను ఉదాహరణగా చెప్పడంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల(Sharmila) స్పందించారు. తన అమెరికా పర్యటనలో భాగంగా ప్రత్యేకంగా తెలుగు భాష గురించి ప్రస్తావించిన రాహుల్ గాంధీకి షర్మిల ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆమె తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు.
‘‘ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు తెలుగు భాష గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినందుకు ధన్యవాదములు. తెలుగు భాషలో చరిత్ర, సంస్కృతి, నృత్యం, ఆహారపు అలవాట్లు ఉన్నాయని.. హిందీ భాషను తెలుగు రాష్ట్రాలపై రుద్దడం అంటే తెలుగు భాషా పూర్వీకులను అవమానించడమే అని రాహుల్ గారు చెప్పిన మాటలు అక్షర సత్యం. RSSలాగా భారతదేశానికి ఒకే భావజాలం ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కోరుకోదు.. భిన్నత్వంలో ఏకత్వమే కాంగ్రెస్ భావజాలం అన్న రాహుల్ గాంధీ గారి మాటలను పూర్తిగా ఏకీభవిస్తున్నాను’’ అని Sharmila తెలిపారు.