తిరుపతి(Tirupati) తోకేసులాట ఘటనలో మృతుల సంఖ్య 6కి చేరింది. మరో 48 మంది క్షతగాత్రులు రుయా, స్విమ్స్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. రుయాలో 34 మందికి, స్విమ్స్ లో 14 మందికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తొక్కిసలాటలో ఇప్పటి వరకు ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు మరణించారు. మృతులను విశాఖకు చెందిన స్వాతి, శాంతి, తమిళనాడుకు చెందిన నిర్మల, మల్లిక, నర్సీపట్నంకి చెందిన బాబు నాయుడు, రజనీ గా గుర్తించారు.
తొక్కిసలాట మృతులకు రుయా, స్విమ్స్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాలను వారి బంధువులకు అప్పగించనున్నారు. మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా అందించనున్నట్లు వెల్లడించింది. ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈరోజు మధ్యాహ్నం బాధిత కుటుంబాలను పరామర్శించనున్నట్లు తెలిపారు.
తిరుమల శ్రీవారి వైకుంట ద్వార దర్శనం టిక్కెట్ల కోసం బుధవారం రాత్రి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో Tirupati లోని విష్ణు నివాసం వద్ద ఏర్పాటు చేసిన టికెట్ కౌంటర్ సమీపంలో తొక్కిసలాట జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో తిరుమల కొండ బాధితుల ఆర్తనాదాలతో మార్మోగింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే విషాద ఘటన చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు, బాధితుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.