Somu veeraju wrotes a letter to cm jagan vishaka land irregularities: విశాఖ భూ అక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రజు మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఆయన సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఉత్తరాంధ్రలో జరిగిన భూ అక్రమాలపై సీబీఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని లేఖలో పేర్కొన్నారు. విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భూ అక్రమాలు జరుగుతున్నాయని.. ప్రభుత్వ, ప్రైవేటు, దేవాదాయ శాఖకు చెందిన భూములే కాదు సామాన్యుల భూములకు రక్షణ లేకుండా పోయిందని సోము వీర్రాజు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు, మాజీ సైనికు కేటాయించిన భూములను కూడా కబ్జా చేస్తున్నారని లేఖలో వివరించారు.
2004 నుంచి విశాఖలో భూదందా జరుగుతుందని.. చంద్రబాబు హయాంలో కూడా ఈ భూ అక్రమాలు జరిగాయని ప్రతిపక్షంగా వైసీపీ ప్రభుత్వం కూడా ఆరోపించిందని గుర్తుచేశారు. ఆ తర్వాత వైసీపీ హయాంలో కూడా.. భూ అక్రమాలు జరిగాయని.. ప్రభుత్వ పాత్ర లేకుంటే నిరూపించుకోవాలని విచారణకు సిద్ధపడాలని సీఎం జగన్‌కు వివరించారు. అయితే.. టీడీపీ హాయంలో భూ కబ్జాలపై విచారణకు ‘‘సిట్’’ వేసిందని గుర్తుచేశారు. కానీ కమిటీ నివేదిక బహిర్గతం కాకుండానే ఎన్నికలు వచ్చాయని.. అనంతరం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. కానీ మూడున్నరేళ్లు గడుస్తున్నా విచారణలోని అంశాలను ఎందుకు బహిర్గతం చేయట్లేదని సీఎంను ప్రశ్నించారు. నాటి సిట్ నివేదిక ఏమైందని సోము వీర్రాజు (Somu veeraju) నిలదీశారు.