Amaravati | ఏపీకి సంబంధించి 73 రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిందని, ప్రస్తుతం రూ.21 వేల కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లు నడుస్తున్నాయని తెలిపారు. విజయవాడ రైల్వే స్టేషన్‌ను పీపీపీ పద్దతిలో అభివృద్ధి చేస్తామని, ఇప్పటి వరకు 257 ఆర్‌యూబీలను తొలగించామని ఆయన తెలిపారు. రైలు ప్రమాదాలను అరికట్టడంలో భాగంగా ఏపీ అంతటా నిర్ణీత కిలోమీటర్ల మేర కవచ్‌ను అమలు చేస్తామని వివరించారు. అదే విధంగా ఏపీ రాజధాని అమరావతికి ప్రత్యేక రైల్వే లైన్ ఏర్పాటు చేయనున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు మధ్య రైల్వే లైన్ ఏర్పాటు కోసం చేపట్టిన సర్వే పూర్తయిందని, రైల్వే బోర్డు ఆమోద ముద్ర వేసి నిధులు కేటాయించిన వెంటనే దీనిని యుద్ధ ప్రాతిపదిక ప్రారంభిస్తామని ఆయన వివరించారు.
Amaravati | విజయవాడలోని రైల్వే ఈటీటీసీ కేంద్రంలో ఏపీలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్ట్‌లపై కేంద్రమంత్రి పెమ్మసారి, టీడీపీ ఎంపీలతో సానుకూల వాతావరణంలో సమావేశం జరిగిందని ఆయన వివరించారు. వారు చేసిన ప్రతిపాదనలను రైల్వే బోర్డు దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. విజయవాడ ప్రధాన స్టేషన్‌కు అనుబంధ శాటిలైట్ స్టేషన్లను ఏర్పాటు చేస్తాం. వాటిలో గుణదల, రాయనపాడు స్టేషన్లను ప్రధానంగా శాటిలైట్ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తామని ఆయన వెల్లడించారు.