ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసుకు సంబంధించి ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేయడంపై మాజీ ఎంపీ, టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు(Raghu Rama Krishnam Raju) స్పందించారు. నిజంగా ఇదొక చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. న్యాయం చేయడం కోసం ఎవరి విషయంలో కూడా కూటమి ప్రభుత్వం వెనక్కు తగ్గదని ఈ నిర్ణయం తేటతెల్లం చేస్తుందని ఆర్ఆర్ఆర్ వ్యాఖ్యానించారు. కాంతిరాణా తాతా, పీఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్నిలను సస్పెన్షన్ చేస్తున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు నోటీసులు విడుదల చేసిన వెంటనే సీఎం చంద్రబాబు చర్యలకు ఉపక్రమించారని తెలిపారు రఘురామ. సినీ నటి కాదంబరి జెత్వానీని తీవ్రంగా వేధించడంలో ఈ ముగ్గురు అధికారులు కీలక పాత్రధారులని అన్నారాయన. కాదంబరి తన ఫిర్యాదులో మరెన్నో విషయాలు చెప్పలేదని, అవి తనకు ఇతరుల ద్వారా తెలియాని ఆయన అన్నారు. జెత్వానికి న్యాయం జరిగే వరకు ఈ కేసులో రాజీ అన్న మాటలకు రాజీ పడొద్దని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు.
అయితే ముంబై నటి కాదంబరి జిత్వాని కేసులో విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా తాతా, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ పేర్లను పోలీసులు జోడించారు. కాగా తాజాగా వీరిపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. ఈ కేసుతో పాటు వారిపై ఉన్న పలు తీవ్ర అభియోగాలపై కూడా విచారణ జరపాలని ఆయన తెలిపారు. దీంతో డీజీపీ తిరుమలరావు ఆదేశాలతో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఈ కేసు విచారణ కోసం రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో కాదంబరి జిత్వానీ, ఆమె కుటుంబీకులపై నమోదు చేసిన కేసుకు సంబంధించిన ఫైళ్లను ఆయన పరిశీలించారు. ఈ కేసు నమోదు, దర్యాప్తులో అనేక లోటుపాట్లు ఉన్నాయని, వీటిపై పూర్తిస్థాయి నివేదికను డీజీపీకి అందించినట్లు ఆయన(Raghu Rama Krishnam Raju) వెల్లడించారు.