టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని(Mangalagiri) పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 43వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఏపీ సీఎం, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) పాల్గొని పార్టీ జెండా ఎగురవేశారు. ఈ వేడుకల్లో రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
వేడుకల్లో చంద్రబాబు(Chandrababu) మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం(TDP Formation Day) సందర్భంగా ‘తెలుగుదేశం కుటుంబ సభ్యులకు’ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నారు. “43 ఏళ్లుగా తెలుగు ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్న పార్టీ..మన తెలుగుదేశం పార్టీ. ‘అన్న’ నందమూరి తారకరామారావు గారి దివ్య ఆశీస్సులతో… సంచలనంగా ఆవిర్భవించిన తెలుగుదేశం దేదీప్యమానంగా వెలుగుతున్నదంటే అందుకు కారణం కార్యకర్తల తిరుగులేని పోరాటం, నిబద్ధత, త్యాగగుణం” అని చంద్రబాబు కార్యకర్తల్ని అభినందించారు.
“ఒక మహనీయుడి విజన్ తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ వంటి వ్యక్తి మళ్లీ పుట్టరు. ఒక ఆదర్శం కోసం పుట్టిన పార్టీ టీడీపీ. అనేక రాజకీయ పార్టీలు వచ్చి వెళ్లిపోయినప్పటికీ, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) శాశ్వతంగా ఉంటుందని, తెలుగు ప్రజలు ఉన్నంత కాలం ఉనికిలో ఉంటుంది” అని చంద్రబాబు అన్నారు. “పార్టీకి మనమంతా వారసులం.. పెత్తందారులం కాదు. నేను కూడా పార్టీకి అధ్యక్షుడిని.. టీమ్ లీడర్ని మాత్రమే. టీడీపీని లేకుండా చేయాలని చాలా మంది చూశారు. టీడీపీని నాశనం చేయాలనుకున్నవారు కాలగర్భంలో కలిసిపోయారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం, బలగం. కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నా” అని చంద్రబాబు కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించారు.