ముంబై నటి కాదంబరి జిత్వాని(Kandambari Jetwani) కేసు కీలక మలుపు తీసుకుంది. ఇప్పటికే ఈ కేసులో విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా తాతా(Kanthi Rana Tata), ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు(PSR Anjaneyulu), ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ(Vishal Gunni) పేర్లను పోలీసులు జోడించారు. కాగా తాజాగా వీరిపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. ఈ కేసుతో పాటు వారిపై ఉన్న పలు తీవ్ర అభియోగాలపై కూడా విచారణ జరపాలని ఆయన తెలిపారు. దీంతో డీజీపీ తిరుమలరావు ఆదేశాలతో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఈ కేసు విచారణ కోసం రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో కాదంబరి జిత్వానీ, ఆమె కుటుంబీకులపై నమోదు చేసిన కేసుకు సంబంధించిన ఫైళ్లను ఆయన పరిశీలించారు. ఈ కేసు నమోదు, దర్యాప్తులో అనేక లోటుపాట్లు ఉన్నాయని, వీటిపై పూర్తిస్థాయి నివేదికను డీజీపీకి అందించినట్లు ఆయన వెల్లడించారు.
ఇప్పటికే ఈ కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా తప్పుడు కేసులో కాదంబరిని(Kandambari Jetwani) అరెస్ట్ చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారంలో కీలక పాత్రధారులు ఈ ఐపీఎస్ అధికారులేనని బాధితురాలు కాదంబరి జిత్వాని చెప్తున్నారు. కాగా తన సన్నిహితుడిని కాపాడుకోవడానికి ఏపీ మాజీ సీఎం జగన్.. తన అనుయాయువలతో కాదంబరినీ తీవ్ర వేధింపులకు గురి చేశారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఈ కేసుపై నూతన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముంబై నటికి న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించింది. దీంతో ఈ కేసు దర్యాప్తులో కదలిక వచ్చింది.