ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటన దేశవ్యాప్తంగా అందరనీ కలచివేస్తుంది. ఈ దుర్ఘటనపై సామాన్యుల నుంచి ప్రముఖల వరకు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ప్రమాద ఘటనలే మన తెలుగు రాష్ట్రాల్లో జస్ట్ మిస్ అయ్యాయి. మొన్న ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్ పరిధిలో గోదావరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్రమాదం ఏమీ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా ఏపీలో మరో రైలు ప్రమాదం తృటిలో తప్పింది.
సత్యసాయి జిల్లా కదిరి రైల్వేస్టేషన్ సమీపంలో నాగర్ కోయిల్-ముంబయి రైలు వచ్చే సమయంలో గేట్‍మెన్ గేటు వేయలేదు. అది గమనించని వాహనాదారులు రైల్వ్ ట్రాక్ దాటుతున్నారు. ఇంతలోనే రైలు వేగంగా దగ్గరికి వచ్చేస్తుంది. అయితే గేటు వేయకపోవడాన్ని గమనించిన లోకో పైలట్ వెంటనే రైలును ఆపేశాడు. దీంతో వాహనాదారులు హమ్మయ్య అనుకున్నారు. ఒకవేళ పైలట్ ట్రైన్ ఆపకపోయి ఉంటే ఎలాంటి ఘోర ప్రమాదం జరిగి ఉండేదో అని ఆందోళన వ్యక్తం చేశారు. గేట్‌మెన్ నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు గేట్‌మెన్‌పై విచారణకు ఆదేశించారు.