తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో(Tirumala) భక్తులకు ఉచితంగా అందించే అన్నప్రసాదంలో మసాలా వడను చేర్చింది. గురువారం ఉదయం తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు వడ ప్రసాదం(Vada Prasadam) వడ్డించే కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు… టీటీడీ ఈవో జె.శ్యామలరావు(Shyamala Rao), అదనపు ఈవో సీహెచ్.వెంకయ్య చౌదరిలతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా TTD చైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu) మాట్లాడుతూ… తాను పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, అన్నప్రసాద మెనూలో భక్తులకు అదనపు వంటకం వడ్డించే ఆలోచనను ముందుకు తెచ్చానని అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన ఆ ఆలోచనకు అంగీకరించి ఆమోదం తెలిపారని చెప్పారు. ఆలయ నిర్వహణ ఇప్పటికే అధిక నాణ్యత గల పదార్థాలతో భక్తులకు అన్నప్రసాదాలను అందిస్తున్నట్లు TTD చైర్మన్ తెలియజేశారు.
కాగా, భక్తులకు అదనంగా వడ్డించే వడల తయారీలో పప్పులు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, సోంపులను ఉపయోగిస్తారని చైర్మన్ వెల్లడించారు. అన్నప్రసాద కేంద్రంలో ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు దాదాపు 35,000 వడలను భక్తులకు వడ్డిస్తామన్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింత పెంచుతామని ఆయన తెలియజేశారు.