తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు(Ramana Deekshithulu)పై తిరుమల తిరుపతి దేవస్థానం వేటు వేసింది. ఆలయ కైంకర్యాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను ఈ పదవి నుంచి తొలగించింది. ఆలయ కైంకర్యాలు, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, టీటీడీ అధికారులు, అహోబిలం మఠం, టీటీడీ జీయర్‌లపై రమణ దీక్షితులు నీచమైన ఆరోపణలు చేశారని.. దీంతో ఆయనను తొలగిస్తున్నామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.
కాగా ఇటీవల టీటీడీలో చాలా మంది క్రిస్టియన్‌లు ఉన్నారని.. ఈవో ధర్మారెడ్డి ఒక క్రిస్టియన్, సీఎం జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని రమణ దీక్షితులు మాట్లాడినట్లు ఓ వీడియో వైరల్ అయింది. ధర్మారెడ్డి కుమారుడు చనిపోతే దహనం చేయలేదు ఖననం చేశారని.. ధర్మారెడ్డిని చూస్తేనే తెలుస్తుంది కదా బొట్టు కూడా పెట్టుకోడు.. వేషధారణ, మాట కూడా అంతే ఉంటుందన్నారు. శ్రీవారికి నైవేద్యం, కైంకర్యాలు కూడా సరిగ్గా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఈ వీడియో వైరల్ కావడంతో రమణ దీక్షితులు(Ramana Deekshithulu) స్పందించారు. ఆ వీడియోలో ఉన్న వాయిస్ తనది కాదని. ఆ వీడియో చూసిన తర్వాత తాను షాక్‌కి గురైనట్టు ఆయన ట్వీట్ చేశారు. తిరుమల అధికారులతో తనకు ఉన్న సత్సంబంధాలను దెబ్బ తీసేందుకు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని మండిపడ్డారు. అయినా కానీ ఆయనను ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు నుంచి తొలగిస్తూ టీటీడీ బోర్లు నిర్ణయం తీసుకుంది.