తిరుమల ఘాట్ రోడ్ల(Tirumala Ghat Road)లో ద్విచక్ర వాహనాల రాకపోకలపై విధించిన ఆంక్షలను టీటీడీ(TTD) సడలించింది. శుక్రవారం స్థానిక అన్నమయ్య భవనంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. అలిపిరి కాలినడక మార్గంలో చిరుతల సంచారం నేపథ్యంలో ప్రయాణికుల భద్రత నిమిత్తం కొంతకాలంగా ఘాట్ రోడ్లలో అమలుచేస్తున్న నిబంధనలను తొలగించి శుక్రవారం నుంచి రాత్రి 10 గంటల వరకు ద్విచక్రవాహనాలను అనుమతించనున్నారు.
కాగా, శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. శుక్రవారం సాయంత్రానికి సర్వదర్శనానికి ఎస్ఎస్ఓ టోకెన్లు లేకుండా క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయి రింగ్ రోడ్డులోని శిలాతోరణం వరకు బారులు తీరారు. వీరు స్వామి దర్శనం చేసుకొనేందుకు దాదాపు 30 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. సాయంత్రం కొంతసేపు వర్షం కురిసింది. గురువారం శ్రీవారిని 54,620 మంది దర్శించుకున్నారు. రూ.2.98 కోట్ల హుండీ కానుకలు లభించాయి. గదుల కోసం రద్దీ కొనసాగుతోంది.
మరోవైపు నవరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం సమీక్ష జరిగింది. అక్టోబర్ 14న అర్పణ, 15 నుంచి 23 వరకు జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఈవో ఏవీ ధర్మారెడ్డి(AV Dharma Reddy) శాఖల వారీగా అధికారులతో సమీక్షించారు. దసరా సెలవుల కారణంగా యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించారు. సమీక్షలో జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహకిశోర్, ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ్ కుమార్, సీఈ నాగేశ్వరరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.
శ్రీవారి ఆలయ సమీపంలో వెళ్లిన విమానాలు:
శ్రీవారి ఆలయ సమీపంలో పైనుంచి ఉదయం 6.39-8.15 గంటల మధ్య మూడు విమానాలు వెళ్లిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఆగమశాస్త్ర నియమం ప్రకారం తిరుమల(Tirumala)పై విమానాలు వెళ్లకూడదు. అయినా తరచూ వెళుతున్నాయి. దీనిపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.