తమ ప్రభుత్వం ఎవరిపై కక్షపూరితంగా వ్యవహరించడం లేదని ఎంపీ రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu) స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా ఉండేది కాదని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో లేవని అన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం దిమ్మిడిజ్వాలలో తన బాబాయి అచ్చెన్నాయుడు(Achennaidu)తో కలిసి రామ్మోహన్ నాయుడు సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తామర పల్లె జాతీయ రహదారి నుంచి దిమ్మిడి జ్వాల(Dimmidijola) వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం లబ్దిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu) మాట్లాడుతూ… ఎవరికైనా కక్షలతో కానీ, పగతో కానీ కేసులు పెట్టాలన్న ఆలోచన తనకి, తన బాబాయికి లేదని తేల్చి చెప్పారు. పొద్దున లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు ప్రజల సమస్యలు ఎలా తీర్చాలి? వారి అభిమానం ఎలా సాధించాలి? వారి గుండెల్లో చోటు ఎలా దక్కించుకోవాలి అనే ఆలోచనలు మాత్రమే చేస్తామని స్పష్టం చేశారు. అయితే ఎవరైనా అడ్డదారుల్లో తప్పులు చేస్తే మాత్రం వారిని చట్టం ఎప్పటికీ వదిలిపెట్టదనే ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.