ఎన్నికల వేళ ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని అయోమయ స్థితి నెలకొంది. తాజాగా సీఎం జగన్‌కు అత్యంత నమ్మకస్తురాలైన వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేశారు. అకస్మాత్తుగా ఆమె రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
2019 ఎన్నికల్లో ఆమె పోటీ చేయాలని భావించినప్పటికీ కొన్ని కారణాలతో టికెట్ లభించలేదు. దీంతో ఆమెకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి ఇచ్చారు. అయితే ఈసారి ఎన్నికల్లో మైలవరం లేదా జగ్గయ్యపేట నుంచి పోటీ చేయాలని పద్మ భావించినట్టు తెలుస్తోంది. అయితే ఈసారి కూడా ఆమెకు టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన ఆమె రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.
కానీ ఆమె వర్గీయులు మాత్రం జగన్‌ను మరోసారి సీఎం చేసేందుకే రాజీనామా చేసినట్టు చెబుతున్నారు. ఎన్నికల వేళ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ రాజకీయ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం కష్టమని.. అందుకే ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొంటున్నారు.