తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓ(TTD JEO)గా ఎవరు బాధ్యతలు తీసుకుంటారు అని కొన్ని రోజులుగా టీటీడీ పాలకమండలిలో తెగ చర్చ జరుగుతూ వస్తోంది. తాజాగా ఈ చర్చలకు కూటమి సర్కార్ ఫుల్‌స్టాప్ పెట్టింది. టీటీడీ జేఈఓగా ఐఆర్ఎస్ అధికారి వెంకయ్య చౌదరిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2005 బ్యాచ్‌కు చెందిన వెంకయ్య చౌదరి మూడు సంవత్సరాల పాటు డిప్యుటేషన్‌పై టీటీడీ జేఈఓగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఆయనను డిప్యుటేషన్‌పై పంపాలంటూ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విన్నపాన్ని ఆమోదించిన కేంద్రంలోని ఎన్‌డీఏ సర్కార్ ఆయనను డిప్యుటేషన్‌పై ఆంధ్రకు పంపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయనకు టీటీడీ జేఈఓ బాధ్యతలు అప్పగించింది ఆంధ్ర సర్కార్.