అచ్యుతాపురం ఫార్మా సెజ్(Atchutapuram SEZ) ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు విశాఖపట్నం కలెక్టర్ హరేందిర ప్రసాద్(MN Harendhira Prasad) ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు కూడా వారి గాయాలను బట్టి పరిహారం అందిస్తామని వెల్లడించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కాగా క్షతగాత్రులకు అందించే చికిత్స విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అధికారులు చెప్పారు.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా సెజ్(Atchutapuram SEZ)లో జరిగిన ఘోర ప్రమాదం మానవ తప్పిదం. సాల్వెంట్ ఆయిల్‌ను ఒక అంతస్తు నుంచి మరొక అంతస్తుకు పంప్ చేసే క్రమంలో లీకై మంటలు చెలరేగాయని అనంతరం పెద్ద పేలుడుతో ప్రమాదం సంభవించి కార్మికుల మరణాలకు దారితీసిందని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు తయారు చేసిన ప్రథమిక నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదిక ఇంకా బయటకు రాలేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్‌కు నివేదిక చేరినట్లు విశ్వసనీయ సమాచారం.