విశాఖపట్టణం(Vizag)లో భారీగా నగదు పట్టుబడింది. ఆటోలో తీసుకెళ్తున్న వాషింగ్ మెషిన్‌లో కోట్ల రూపాయల నగదు తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎన్‌ఏడీ జంక్షన్ వద్ద తనిఖీలు నిర్వహించిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రూ.1.30 కోట్ల కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు 30 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించిన బిల్లులు చూపించకపోవడంతో సీఆర్‌పీసీ 41, 102 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం నగదును ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు.
ఆటోను సీజ్ చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విశాఖ(Vizag) నుంచి విజయవాడ(Vijayawada)కు తరలిస్తున్న ఈ నగదును నగరంలోని ఓ ఎలక్ట్రానిక్ దుకాణానికి సంబంధించిందిగా గుర్తించారు. వాహనంలో రెండు బాక్సుల్లో సుమారుగా రూ.కోటి 30 లక్షలు నగదు, 30 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. సదరు కంపెనీ యాజమాన్యం సరైన ఆధారాలు చూపించాలని అడిగామన్నారు. సరైన ఆధారాలు లేకపోవడంతో హవాలా డబ్బుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వాషింగ్ మెషీన్‌లో గుట్టలు గుట్టలుగా డబ్బులు దొరకడం నగరంలో చర్చనీయాంశమైంది.
Read Also: బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా.. ఎల్లుండి కాంగ్రెస్‌లో చేరిక..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat