అచ్యుతాపురం ఘటనపై సీఎం చంద్రబాబు(Chandrababu) స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. అనంతరం బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 లక్షల, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25 లక్షలు పరిహారంగా అందిస్తామని చెప్పారు. అనంతరం పరిశ్రమల్లో భద్రతపై మాట్లాడారు.
‘‘పరిశ్రమల్లో భద్రతకు పెద్దపీట వేయాలి. నిబంధనల మేరకు ఎస్‌ఓపీని అనుసరించాలి. ఈ విషయంలో ఫార్మా కంపెనీ నిర్లక్ష్యం వహించింది. నిబంధనలను తుంగలో తొక్కింది. గత ఐదేళ్లలో విశాఖలో 119 ఘటనలు ఇటువంటివే జరిగాయి. వాటిలో 120 మంది ప్రాణాలు కోల్పోయారు. పరిశ్రమల్లో వెంటనే భద్రతపై అంతర్గత విచారణ చేపట్టాలి. రెడ్ కేటగిరీలోని పరిశ్రమలన్నీ కచ్ఛితంగా ఎస్‌ఓపీని పాటించాలి. ఎసెన్షియా ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కమిటీ వేస్తున్నాం. పరిశ్రమలో ఏం జరిగింది. లోపాలపై కమిటీ విచారిస్తుంది. నివేదిక వచ్చిన తర్వాత ఎవరు తప్పు చేసినా వదిలి పెట్టేది లేదు. కఠినంగా శిక్షిస్తాం. బాధిత కుటుంబాలకు, క్షతగాత్రులకు సంస్థ నుంచే పరిహారం ఇప్పిస్తున్నాం. ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెడతాం. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ కోసం కూడా ఓ కమిటీని ఏర్పాటు చేస్తాం’’ CM Chandrababu అని వెల్లడించారు.