తిరుపల తిరుపతి దేవస్థానం ఆస్తుల అమ్మకాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అసలు శ్రీవారి ఆస్తులను పరిరక్షించడం మరిచి వాటిని పప్పుబెల్లాల్లా అమ్మడానికి గత పాలక మండలి ఉత్సాహం చూపడానికి కారణం ఏంటి? శ్రీవాణి ట్రస్ట్(Srivani Trust) సేకరించిన నిధులను ఏం చేశారు? శ్రీవారి ఆస్తులను అమ్మేదిశగా గత పాలక మండళ్లను నడిపిందెవరు? ఈ విషయంపై విచారణ చేపట్టి.. అందరి పేర్లు బయటపెడతామని పవన్ కల్యాణ్ తెలిపారు. శతాబ్దాలుగా రాజులు, భక్తులు సమర్పించిన నగలు, ఆభరణాలను కూడా పరిశీలించాలని, తిరుపతి దేవస్థానంతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాల ఆస్తులపై సమీక్ష చేయాలని ఆయన కోరారు.
Srivani Trust ఆదాయం ఎక్కడ..
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా భక్తుల నుంచి రూ.10,500 చొప్పున తీసుకున్నారని, బిల్లు మాత్రం రూ.500కే ఇచ్చారని, మిగిలిన రూ.10వేల ఏమయ్యాయని పవన్ ఆరా తీశారు. ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి వచ్చిన ఆదాయాన్ని ఎటు మళ్లించారు? ఏం చేశారు? దేనికి ఎంత ఖర్చు చేశారు? బిల్లుల్లో అవకతవకలు ఎలా వచ్చాయి? ఎందుకు వచ్చాయి? అన్ని అంశాలపై విచారణ చేయాలని సీఎం చంద్రబాబును కోరినట్లు పవన్ వెల్లడించారు.