మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన తిరుమల పర్యటనను రద్దు చేసుకోవడంపై సీఎం చంద్రబాబు(Chandrababu) ఘాటుగా స్పందించారు. తిరుమల బాలాజీపై తనకు విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకనే జగన్ తన తిరుపల పర్యటన రద్దు చసుకున్నారని చంద్రబాబు అన్నారు. కానీ ఆ మాట చెప్పకుండా తిరుమల రావడానికి తనకు అనుమతి లేదంటూ నోటీసులు ఇచ్చారంటూ కబుర్లు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. నిజంగా పోలీసులు నోటీసులు ఇచ్చి ఉంటే.. వాటిని మీడియాకు చూపించాలని, ఏవేవో వాళ్లే రాసుకుని వాటిని మీడియా ముందు చదవడం కాదంటూ ఎద్దేవా చేశారు ముఖ్యమంత్రి. ఇష్టం లేకపోతే వెళ్లొద్దు.. ఎవరినీ ఎవరూ ఎక్కడికీ వెళ్లాలని బలవంతం చేయడం లేదని అన్నారు.
‘‘జగన్‌కు ఇష్టం లేకుంటే తిరుపతికి వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ వెళ్తానంటే మాత్రం అక్కడి సంప్రదాయాలను తప్పకుండా పాటించి తీరాల్సిందే. అన్యమతస్తుడై ఉండి డిక్లరేషన్‌పై సంతకం చేయనని దౌర్జన్యం చేస్తే కుదరదు. వేంకటేశ్వర స్వామిపై భక్తి ఉన్న వారు ఎవరైనా తిరుమల(Tirumala) దర్శనం చేసుకోవచ్చు. వేరే మతాల వారు దర్శనానికి వెళ్లాలంటే కొన్ని సంప్రదాయాలు, పద్దతులు పాటించాల్సి ఉంటుంది. వాటి కంటే ఏ వ్యక్తీ గొప్ప కాదు. తిరుమలకు జగన్ వెళ్లాలంటే తప్పకుండా డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సిందే. ఆయనను తిరుమలకు వెళ్లొద్దని కూడా ఎవరూ చెప్పలేదు. వెళ్లినా అక్కడ ర్యాలీలు, జనసమీకరణలు చేయొద్దని మాత్రమే చెప్పాం. వైసీపీ వాళ్లు ర్యాలీలు, బల ప్రదర్శనలు చేస్తే తాము కూడా పోటీగా వేల సంఖ్యలో బల ప్రదర్శనకు దిగుతామని భక్తులు స్థానికంగా సమాచారం ఇచ్చారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త తీసుకోవడంలో భాగంగానే సెక్షన్ 30 కింద పోలీసులు నిషేధాలు విధించారు’’ అని వివరించారు చంద్రబాబు(Chandrababu).