మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి(Pinnelli Ramakrishna Reddy)కి బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో భాగంగా ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుపై తాజాగా జరిగిన విచారణలో భాగంగా కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేయడానికి న్యాయస్థానం అంగీకరించింది. షరతులన్నింటికీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంగీకరించడంతో బెయిల్ మంజూరు చేస్తున్నట్లు వెల్లడించింది. పిన్నెల్లి తన పాస్‌పోర్ట్‌ను అధికారులను అందించాలని న్యాయస్థానం తెలిపింది. అదే విధంగా రాష్ట్రం విడిచి వెళ్లకూడదని, ఈ కేసులకు సంబంధించిన సాక్ష్యులను, అధికారులను కలవడానికి ప్రయత్నించకూడదని కూడా అధికారులు చెప్పినట్లు సమాచారం.
అయితే ఈవీఎం(EVM) విధ్వంసం సహా మరో రెండు కేసుల్లో పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈవీఎంను పిన్నెల్లి నేలకేసి కొట్టిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. వీటి ఆధారంగా చర్యలు చేపట్టిన పోలీసులు.. ఐపీసీలోని 143, 147, 448, 427, 353, 452, 120బితో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం, పిడి చట్టం, ఆర్పీ చట్టం 131, 135లోని పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. ఇటీవల ఆయన(Pinnelli Ramakrishna Reddy)ను అరెస్ట్ చేసి నెల్లూరులోని జైలులో ఉంచారు. తాజాగా ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో నెల్లూరులోని కారాగారం దగ్గర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయనను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.