తిరుపతి శ్రీవారి లడ్డూ(TTD Laddu) ప్రసాదంపై సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపాయి. తిరుపతి ప్రసాదాల్లో స్వచ్ఛమైన ఆవునెయ్యి అని చెప్పి కల్తీ నెయ్యి వినియోగించారని, అందులో చేపనూనె, పశువుల కొవ్వులు, పామాయిల్ ఇలా అనేక ఇతర పదార్థాలు కలిపి టీటీడీని వైసీపీ అపవిత్రం చేసిందంటూ చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ వ్యవహారంపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు నడుస్తున్నాయి. ఒకరికొరు తీవ్ర ఛాలెంజ్‌లు చేసుకుంటున్నారు. కాగా శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో తమ ప్రభుత్వం కేవలం స్వచ్ఛమైన ఆవునెయ్యినే వినియోగించిందని, ఎటువంటి జంతువుల కొవ్వులను కలపలేదని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఘాటుగా బదులిచ్చారు. ఇదే విషయంపై తిరుమల తిరుపతి దేవస్థానంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రమాణం చేస్తానని, అలా కాకుండా కలిసిందని ప్రభుత్వం కూడా సవాల్ చేస్తుందా అని ఆయన ఛాలెంజ్ చేశారు. వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) ఛాలెంజ్‌కు టీడీపీ నేత కొలికిపూడి శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
‘‘తిరుమల ప్రసాదం(TTD Laddu)పై ప్రమాణం చేయడానికి మేము రెడీ. ఎప్పుడు, ఎక్కడా అనేది కూడా మీరే డిసైడ్ చేసుకోండి. వైసీపీ నేతలు కానీ ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కానీ ఏనాడైనా.. ఏ విషయంలోనైనా మాటపైన నిలబడ్డారా? సీఎం కాకముందు వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ విచారణ జరపాలని జగన్ కోరారు. కానీ సీఎం అయ్యాక.. ఆ అంశాన్ని అటకెక్కించేశారు. వివేకా కూతురు సునీత న్యాయం కోసం పోరాడుతున్నా ఏమాత్రం సహాయం కూడా అందించలేదు. ప్రత్యేక హోదా విషయంలో కూడా ఇలానే చేశారు. సంపూర్ణ మద్యం నిషేదం విషయంలో జగన్ ఏం చేశారో అందరికీ తెలుసు. తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాద తయారీ విషయంలో కూడా భారీగా అవకతవకలు జరిగాయి. నిజంగా దమ్ము, ధైర్యంగా ఉంటే విచారణకు డిమాండ్ చేయండి’’ అని కొలికపూడి శ్రీనివాస్ ప్రతిసవాల్ చేశారు.