టీడీపీ యువనేత యువగళం పాదయాత్ర గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా అమరావతి ఆక్రందన పేరిట అమరావతి రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అనంతరం ఆమె మట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. అమరావతి రైతులు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. అమరావతి అంటే చంద్రబాబు, అమరావతి అంటే లోకేశ్ అని తెలిపారు. వారిద్దరూ ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి రైతులను వదిలివేయరని శ్రీదేవి వెల్లడించారు.
ఉండవల్లి శ్రీదేవి ఎలా తిరుగుతుందో చూస్తామని కొందరు వైసీపీ నేతలు బెదిరించారని తెలిపారు. కానీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించి లోకేశ్ కొండంత భరోసా ఇచ్చారని పేర్కొన్నారు. పార్టీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని, కానీ తనను రోడ్డున పడేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలతో ఫోన్లు చేయించి, రకరకాలుగా చిత్రవధ చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. అలాంటి సమయంలో తాను ఎప్పుడూ చూడని లోకేశ్.. తనకు మద్దతిచ్చారని.. అందుకు ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నానని ఆమె వెల్లడించారు.
ఇక ఈ కార్యక్రమంలో లోకేశ్ మాట్లాడుతూ ఏపీ రాజధాని కోసం అమరావతి రైతులు ఏటా మూడు పంటలు పండే భూమిని త్యాగం చేశారని కొనియాడారు. ఈ త్యాగం ఐదు కోట్ల మంది ఆంధ్రుల కోసమేనని తెలిపారు. గత ఎన్నికలకు ముందు జగన్ అమరావతికి జై కొట్టారని గుర్తుచేశారు. అధికారాంలో మాట మార్చారని మండిపడ్డారు. అమరావతి రైతులపై కేసులు పెట్టారని.. అమరావతి ఉద్యమం వల్లే తాను తొలిసారి పోలీస్ స్టేషన్‌కు వెళ్లానన్నారు. అమరావతి రైతులు మరో 9 నెలలు ఓపిక పట్టాలని.. వేధించినవారికి మన ప్రభుత్వం వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని భరోసా ఇచ్చారు.