14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో చెప్పాలని సీఎం జగన్(YS Jagan) నిలదీశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ సభలో ఆయన ప్రసంగించారు. జిత్తులమారి చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు సూచించారు. వైసీపీ ఎప్పుడూ పేదల పార్టీ అని ఇప్పుడు జరుగుతున్న సంక్షేమం కొనసాగాలంటే మీ బిడ్డ జగన్‌కు ఓటేసి గెలిపించుకోవాలి అంటూ పిలుపునిచ్చారు.
“ఈ ఎన్నికలు జగన్‌కు, చంద్రబాబు(Chandrababu)కు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావు. ప్రజలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. జగన్‌కు ఓటేస్తే.. ఇప్పుడున్న పథకాలు కొనసాగుతాయి. బాబుకు ఓటేస్తే ఇప్పుడున్న పథకాలన్నీ ఆగిపోతాయి. చంద్రబాబు అంటే ఎన్నికల ముందు గంగా.. అధికారం దక్కిన తర్వాత చంద్రముఖి. చంద్రబాబుకు ఓటేస్తే పేదవాళ్లు మోసపోతారు. ఇవి పేదల తలరాతను మార్చే ఎన్నికలు. మేం ఎప్పుడూ పేదల పక్షమే. జరుగుతున్న మంచి కొనసాగాలంటే జగన్(YS Jagan)కు ఓటేయాలి. పచ్చమీడియా గాడిదను తీసుకొచ్చి గుర్రం అని ప్రచారం చేస్తాయి’’ అని జగన్ మండిపడ్డారు.
చంద్రబాబు 14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారా? చంద్రబాబు హయాంలో ఒకరికైనా మంచి జరిగిందా? అదే మీ బిడ్డ అధికారంలోకి రాగానే 2లక్షల31వేల ఉద్యోగాలు భర్తీ చేశాడు. జాబు రావాలంటే ఎవరు కావాలి? జాబు రావాలంటే ఫ్యాను రావాలా.. లేక తుప్పు పట్టిన సైకిల్ రావాలా?. పేదలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. గతంలో రైతుకు ఏమీ చేయని చంద్రబాబు.. ఇప్పుడు మేలు చేస్తాడట. బాబుది బోగస్ రిపోర్ట్.. జగన్‌ది ప్రొగ్రెస్ రిపోర్ట్” అంటూ తెలిపారు.