ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ నేతలనుద్దేశించి టీడీపీ మంత్రి నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అంటేనే అరాచకత్వానికి మారుపేరని విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీసీ నేత వల్లభనేని వంశీ, జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘వల్లభనేని వంశీ అంటేనే అరాచకత్వం, అవినీతి, గుండాయిజం అలాంటి వ్యక్తిని సమర్థిస్తున్న జగన్ కూడా ఒక అరాచక శక్తి.
దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏ పార్టీ పైన దాడి జరిగిన ఘటన లేదు. కానీ వల్లభనేని వంశీ జాతీయ రహదారి పక్కన ఉన్న తెలుగుదేశం ఆఫీసును ఐదు గంటల పాటు తగలబెట్టారు. పార్టీ ఆఫీస్ దాడిపై ఫిర్యాదు చేసిన దళిత వ్యక్తిని కిడ్నాప్ చేసిన ఘనుడు వల్లభనేని వంశీ. ప్రజలు 11 సీట్లు ఇచ్చినా ఇంకా జగన్ కు బుద్ధి మారలేదు. శాసనమండలిలో ఎన్డీఏకి స్పష్టమైన మెజారిటీ కల్పించాలని విజ్ఞులైన పట్టభద్రులకు విజ్ఞప్తి చేస్తున్నాము. సముద్రంలో చేపల వేట నిషేధిత రోజుల్లో ఏప్రిల్ మాసం నుంచి మత్స్యకారులకు జీవన మృతి నిమిత్తం 20 వేల రూపాయలు అందజేస్తాం.
మే నెలలో రైతులకు 20,000 చొప్పున అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయబోతున్నాం. జూన్ నెల విద్యా సంవత్సరానికి ముందు నుంచే తల్లికి వందనం కార్యక్రమం రాష్ట్రంలో అమలు చేస్తాం. ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపునకు అంతా కృషి చేయాలి’’ అని Nimmala Ramanaidu తెలిపారు.