అధికారం చేజారిన తర్వాత జగన్(YS Jagan).. అసెంబ్లీ మొఖం కూడా చూడలేదు. ప్రమాణ స్వీకారం సమయంలో ఏదో తూతూ మంత్రంగా వచ్చి ప్రమాణ స్వీకారం అంతవరకు మమ అనిపించుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. కాగా, ఇప్పుడు ఫిబ్రవరి 24 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఈ సమావేశాలకైనా జగన్ హాజరవుతారా? అన్నది ప్రస్తుతం రాష్ట్రంలో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
కాగా, ఈ విషయంపై జగన్(YS Jagan) ఒక నిర్ణయానికి వచ్చారని కూడా తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు(AP Assembly Session) హాజరవ్వాలని జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్ ఒక్కరే కాదు ఆయనతో పాటు వైసీపీ(YCP) నేతలంతా కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరై వాదనలు వినిపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తమ పార్టీ నేతలకు వైసీపీ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉంటే ఫిబ్రవరి 24న ఉదయం 9:30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం కానున్నారు. శాసనసభ, మండలిలో వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఎన్‌డీఏ కూటమి(NDA Alliance) పార్టీలు చెప్పిన సూపర్ సిక్స్ హామీలు(Super Six Guarantees), ప్రభుత్వ వైఫల్యాలపై సర్కార్‌ను నిలదీయాలని వైసీపీ భావిస్తున్నట్లు సమాచారం. కాగా, అదే రోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్.. అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.