అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా రాష్ట్రంలోని మహిళలకు మాజీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. మహిళల కోసం తమ ప్రభుత్వం ఎంతో చేసిందని అందులో చెప్పుకొచ్చారు. ‘‘నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు. “మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటే దేశం కూడా బాగుంటుంది’’ అని గట్టిగా నమ్మే వ్యక్తిని. ఆ దిశలోనే మన ప్రభుత్వ కాలంలో మహిళల అభ్యున్నతి, సాధికారతకు పెద్దపీట వేస్తూ పాలన చేశాం.
అన్నిరంగాల్లో మహిళలను ప్రోత్సహించి, దాదాపు 32కు పైగా పథకాల ద్వారా వారికి భరోసా కల్పించాం. నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం కేటాయిస్తూ తొలిసారిగా చట్టం చేశాం. గిరిజన, దళిత మహిళలను డిప్యూటీ సీఎం, హోంమంత్రి లాంటి పెద్ద పదవులతో గౌరవించాం. మహిళల భద్రత, రక్షణ కోసం “దిశ’’ వ్యవస్థను ప్రవేశపెట్టాం. “ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు’’అన్న నానుడిని నమ్ముతూ ఆ దిశగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టాం. నా భవిష్యత్ రాజకీయ ప్రస్థానం కూడా మహిళాభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా సాగుతుంది’’ అని పేర్కొన్నారు.