YS Sharmila | ‘పచ్చ కామర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని ఒక సామెత ఉంది. ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీ నేతల తీరు కూడా అదే విధంగా ఉంది. సాక్షి పత్రికలో తల్లికి వందనం ఉత్తర్వులపై వచ్చిన వార్తకు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని మేము ప్రశ్నిస్తే.. కాంగ్రెస్ పార్టీ బాబుకు తోక పార్టీ అంటూ వైసీపీ మాకు ముడిపెట్టడం వారి అవగాహన రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనం’’ అంటూ వైసీపీ నేతలపై షర్మిల విరుచుపడ్డారు. వైసీపీ నేతలు చూడటానికి కళ్లు, వినడానికి చెవులు, విజ్ఞత ఉన్నవారైతే తాము చెప్పింది పది సార్లు వినాలని చురకలంటించారు షర్మిల.
‘‘తల్లికి వందనం జీవో 29 క్లారిటీ లేదంటూ సాక్షి పత్రిక రాసిన వార్తకు బాబు వివరణ ఇవ్వాలి. ఇంట్లో ఉన్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం వర్తింపజేయాలి’’ అని మేము డిమాండ్ చేశాం. కానీ దానిని వైసీపీ వక్రీకరించిందని విమర్శించారు. సీఎంను నిలదీస్తే కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాసినట్లు ఎలా అవుతుంది? అని ప్రశ్నించారామే. మేము నిలదీశాం కాబట్టే 24 గంటల్లో కూటమి సర్కార్.. రాష్ట్ర ప్రజలకు తల్లికి వందనం పథకంపై స్పష్టత నిచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగానే వైసీపీ నేతలకు ఆమె ఓపెన్ ఛాలెంజ్ కూడా చేశారు.
‘‘2019లో ఇంట్లో ఇద్దరు బిడ్డలకు అమ్మఒడి ఇస్తామని జగన్ చెప్పలేదా? ఆ ఒక్క ముక్క పట్టుకుని నేను రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయలేదా? కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు దానిని నిలబెట్టుకున్నారా? మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిన తల్లులందరినీ నిలువునా మోసం చేశారు. మోసం చేయలేదా? ఈ ప్రశ్నకు 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పే సమాధానమిస్తుంది. వైసీపీ విజయం కోసం నేను బైబై బాబు క్యాంపెయిన్ చేయడం ఎంత నిజమో.. ఆ నాడు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున ప్రతి తల్లికి అమ్మఒడి అందిస్తామని ప్రచారం చేయడం కూడా అంతే నిజం. కానీ ప్రతి బిడ్డకూ రూ.15 వేల చొప్పున ఇచ్చే ఉద్దేశమే లేకుంటే ఆనాడు నాచేత ఎందుకు ప్రచారం చేయించినట్లు? మీరెండుకు ప్రచారం చేసినట్లు? సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు, జలయజ్ఞం అన్నారు, కేంద్రం మొడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని ప్రచారం చేశారు, చేయించారు. ఇది నిజం కాదా? మరి ఈ అంశాలపై బహిరంగ చర్చకు సిద్ధమా?’’ అని సవాల్ చేశారు షర్మిల(YS Sharmila).