ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం కావడానికి జగనే కారణమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) విమర్శించారు. వాళ్లు చేసుకున్న స్వయంకృపారాధం వల్లే ప్రజలు ఛీ కొట్టి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారంటూ చురకలంటించారు. 2019 ఎన్నికల్లో ఏదో చేసేస్తారని నమ్మి 151 స్థానాలలో గెలిపిస్తే ఏం చేశారు. మాయమాటలు చెప్పి మోసం చేశారు. వైసీపీ(YCP) పాలనా సమయంలో జరిగినంత అవినీతి, అక్రమాలు ఎన్నడూ జరగలేదు. వాటిని గమనించే ఈసారి ప్రజలంతా ఐకమత్యంతో 11 సీట్లే కట్టబెట్టారు. ఆ పదకొండు స్థానాలైనా ఇచ్చినందుకు జగన్ సంతోష పడాలని ఎద్దేవా చేశారు.
‘‘జగన్(YS Jagan)ను ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారు. ఎన్నికల గెలిపించిన వారి తరపున పోరాడాల్సిన బాధ్యత లేదా? ఎన్నికల్లో 11 సీట్లైనా ఇచ్చారు. ఆ కృతజ్ఞత అయినా ఉండాలి కదా? మాట్లాడనివ్వరు, మైక్ ఇవ్వరు అని అసెంబ్లీకి వెళ్లననడం విడ్డూరంగా ఉంది. ఆయన మాటలు చూస్తే జగన్ అజ్ఞానం, అహంకారం, అసమర్థత బయటపడుతున్నాయి. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం, దమ్ము, సామర్థ్యం లేవా? సమాధానం చెప్పాలి జగన్. ధైర్యం లేదనే అనుకుంటే పదవికి రాజీనామా చేయి. లేదంటే అసెంబ్లీకి వెళ్లి నిన్ను గెలిపించిన వారి తరపున పోరాడు. వైసీపీ ఎమ్మెల్యేలను కూడా మేము ఇదే ప్రశ్నిస్తున్నాం. ఒక్కరు కూడా అసెంబ్లీకి వెళ్లడం లేదు’’ అని షర్మిల(YS Sharmila) విరుచుకుపడ్డారు.