ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) మరోసారి వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రిపబ్లిక్ డే సందర్భంగా విజయవాడలోని ఏపీసీసీ కార్యాలయంలో ఆమె జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ తాను ఏదో ఆశించి జగన్ కోసం తిరగారన్న వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.
‘‘ఎవరూ కితాబు ఇవ్వకపోతే నా విలువ ఎక్కువ కాదు, తక్కువ కాదు. నేను వైఎస్ కూతురుని అయినప్పుడు వైఎస్ షర్మిల కాకుండా ఎలా ఉంటాను. నా కొడుక్కి వైఎస్ రాజారెడ్డి అని పేరు పెట్టుకున్నా. నాకు చాలా దగ్గర మనిషి కొండా రాఘవ రెడ్డి(Konda Raghava Reddy) కూడా నేను అడిగి పాదయాత్ర చేశానని మాట్లాడారు.. అన్నా కొండా అన్నా మీరు ప్రమాణం చేయగలరా… మీ ఆరోపణలు నిజం కాదు అని నేను ప్రమాణం చేయగలను. అక్రమంగా సంపాదించుకోడానికి నా భర్తతో జగన్(YS Jagan) వద్దకు వెళ్ళానని అభాండాలు వేస్తున్నారు. నేను ఏమీ ఆశించి ఈరోజు వరకూ నా అన్న వద్దకు వెళ్ళలేదు… దానికి సాక్ష్యం మా అమ్మే.. మీకు దమ్ముంటే మా అమ్మను అడగండి’’ అని సవాల్ చేశారు.
అంబేద్కర్ ఆశయాలు పాటించకుండా పెద్ద పెద్ద విగ్రహాలు పెడితే సరిపోతుందా అని నిలదీశారు. కొందరు నియంతల్లా మారి రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని షర్మిల(YS Sharmila) మండిపడ్డారు. దళితులు, ఇతర సామాజికవర్గాలకు చెందిన అందరూ బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని.. దళితులపై కపట ప్రేమను చూపిస్తున్న వారికి బుద్ధి చెప్పాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు.