ఏపీకి ప్రత్యేకహోదా కోసం కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల(YS Sharmila) నడుం బిగించారు. ఏపీసీసీ చీఫ్ అయిన రోజు నుంచే ప్రత్యేకహోదాపై ఆమె తన గళం గట్టిగా వినిపిస్తున్నారు. ఈ అంశాన్ని వైసీపీ, టీడీపీలు విస్మరించాయంటూ విమర్శలు చేస్తున్నారు. రెండు పార్టీలు బీజేపీకి తొత్తులుగా మారాయంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఏకంగా ఢిల్లీ వేదికగా పోరాటానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు జాతీయ పార్టీల నేతల మద్దతు కోరుతున్నారు.
ఈమేరకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కలిశారు. ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర విభజన హామీల అంశాలను పవార్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తాలని విజ్ఞప్తిచేశారు. అనంతరం డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరిని కూడా కలిసి మద్దతు కోరారు. వారు ఇందుకు అంగీకరించినట్లు ఇచ్చినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.
షర్మిల వెంట కాంగ్రెస్ సీనియర్ నేతలు కేవీపీ రామచంద్రరావు, రఘువీరా రెడ్డి, జేడీ శీలం, గిడుడు రుద్రరాజు, జేడీ శీలం, రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ఉన్నారు. ఏపీ భవన్‌లో ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు షర్మిల(YS Sharmila) దీక్ష చేయనున్నారు. ఈ దీక్షలకు కాంగ్రెస్ పెద్దలతో పాటు ఇండియా కూటమి నేతలు కూడా హాజరుకానున్నారు.