పార్టీ బలోపేతమే లక్ష్యంగా జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన ఏపీసీసీ చీఫ్ షర్మిల(YS Sharmila) శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించారు. పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణికులతో ముచ్చటించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై ఆరా తీశారు. ఆమె వెంట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్, ఏపీసీసీ మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజు, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి(Raghu Veera Reddy) తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇంచార్జ్ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు. “వైవీ సుబ్బారెడ్డి గారు.. సీఎంను జగన్ రెడ్డి గారు అనటం నచ్చలేదంటున్నారు. సరే ఇక నుంచి జగన్ అన్నగారూ అనే అందాం. మీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూపిస్తామన్నారు. మేము చూడటానికి సిద్దంగా ఉన్నాం. టైం, డేట్ మీరు చెప్పిన సరే, నన్ను చెప్పమన్నా సరే రెడీ. మీరు చేసిన అభివృద్ధి చూసేందుకు నాతో పాటు మేధావులు, ప్రతిపక్ష నేతలు, మీడియా ప్రతినిధులు కూడా వస్తారు. మీరు అభివృద్ధి చేసింది ఎక్కడా..? మీరు చెప్పిన రాజధాని ఎక్కడా..? మీరు కట్టిన పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడా..? మీరు నడుపుతున్న మెట్రో ఎక్కడా..? ఇలా మీరు చేసిన అభివృద్ధిని చూడటానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. చూపించండి” అని సవాల్ చేశారు.
కాగా అంతకుముందు పక్క రాష్ట్రం నుంచి వచ్చి అభివృద్ధి జరగలేదని చెప్పడానికి వాళ్లు ఎవరు? అని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. తమతో వస్తే షర్మిల(YS Sharmila)కు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూపిస్తామని వెల్లడించారు.