సోదరుడు సీఎం జగన్(YS Jagan)తో ఆయన సోదరి వైయస్ షర్మిల(YS Sharmila) భేటీ కానున్నారు. ప్రస్తుతం కడపలో ఉన్న షర్మిల ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి తాడేపల్లి వెళ్లి సాయంత్రం 4 గంటలకు జగన్‌తో సమావేశం కానున్నారు. షర్మిల వెంట తల్లి విజయమ్మ, కుమారుడు రాజారెడ్డి(Raja Reddy), కాబోయే కోడలు ప్రియా అట్లూరి(Atluri Priya) కూడా ఉండనున్నారు. అయితే జగన్‌కు కేవలం కుమారుడి పెళ్లి శుభలేఖ ఇచ్చి వివాహానికి మాత్రమే ఆహ్వానించనున్నారట. ఈ భేటీలో ఎలాంటి రాజకీయ చర్చలు ఉండవని.. ఎక్కువ సమయం కూడా భేటీ ఉండదని చెబుతున్నారు. అనంతరం గన్నవరం నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు.
రేపు(గురువారం) ఉదయం 11 గంటలకు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)ల సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అనంతరం తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నారు. అయితే షర్మిలకు ఏఐసీసీ పదవి అప్పగిస్తారా? ఏపీ పీసీసీ పగ్గాలు కేటాయిస్తారా? అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది.
ఇక మంగళవారం మధ్యాహ్నం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన షర్మిల(YS Sharmila) మీడియాతో మాట్లాడుతూ ‘‘ కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీతో నడవాలనే ఉద్దేశంతోనే తెలంగాణలో పోటీలో నిలవలేదు. మా మద్దతుతోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 31 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచేందుకు మేం పోటీ చేయకపోవడమే ప్రధాన కారణం. కేసీఆర్ అరాచక పాలనను అంతమొందించేందుకు నా వంతు కృషి చేశా. బుధవారం కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళ్తున్నాను. రెండు రోజుల్లో స్వయంగా నేనే అన్ని విషయాలు వెల్లడిస్తాను’’ అని తెలిపారు.