తనకు ప్రాణహాని ఉందంటూ వైఎస్ వివేకా కుమార్తె డా.సునీత(YS Sunitha) సైబరాబాద్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ శిల్పవల్లి కీలక విషయాలు వెల్లడించారు. ఫేస్బుక్ వేదికగా చంపేస్తామని పోస్టులు పెడుతున్నారని సునీత తనకి ఫిర్యాదు చేసినట్టు డీసీపీ తెలిపారు. వైఎస్ సునీతను లేపేస్తామన్నట్టు అర్ధం వచ్చేలా ఆ పోస్టులు ఉన్నట్టు చెప్పారన్నారు. బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని సునీత కోరినట్లు పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు విచారణ చేస్తామని డీసీపీ శిల్పవల్లి తెలిపారు.
కాగా, గత ఎన్నికల ముందు జరిగిన వైఎస్ వివేకానంద హత్య కేసు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దీనిపై ఆయన కుమార్తె డాక్టర్ సునీత అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు. సొంత అన్న జగన్ ప్రభుత్వంలో న్యాయం జరిగేలా లేదని భావించి CBI విచారణకు డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో వివేకా(YS VIveka) హత్య కేసును సీబీఐ విచారిస్తోంది. ఈ దర్యాప్తులో భాగంగా వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు కూడా అందాయి. ఆయన తండ్రి జైలు పాలయ్యారు. ఈ వ్యవహారం అవినాష్ కి అండగా ఉన్న ఏపీ సీఎం జగన్ కి మచ్చగా మారింది. అవినాష్ సన్నిహితులు కూడా సునీత(YS Sunitha)పై ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సునీతకు బెదిరింపులు వస్తున్నాయని ఆమె సన్నిహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి వలన ఆమెకి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.