ఏపీ ఎన్నికల ప్రచారం ముగుస్తున్న సమయంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. సీఎం జగన్ తల్లి విజయమ్మ తన మద్దతు షర్మిలకు ప్రకటించారు. ఈ మేరకు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. “వైఎస్సార్‌ను అభిమానించే వారికి, ప్రేమించే వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఆదరించినట్లే ఇప్పుడు షర్మిలమ్మను కూడా ఆదరించాలని కడప ప్రజలకు నా విన్నపం. వైఎస్సార్ ముద్దుల బిడ్డ షర్మిలమ్మ కడప ఎంపీగా పోటీ చేస్తుంది. షర్మిలమ్మను కడప ఎంపీగా గెలిపించి పార్లమెంట్‌కి పంపించాలని కోరుతున్నాను” విజయమ్మ వెల్లడించారు.
కాగా కుమార్తె షర్మిల ఏపీసీసీ చీఫ్‌గా కుమారుడు జగన్ సీఎంగా ఉన్న నేపథ్యంలో విజయమ్మ రాజకీయంగా సైలెంట్ అయిపోయారు. రాజకీయాలకు దూరంగా అమెరికాకు వెళ్లిపోయారు. తాజాగా షర్మిలను కడప ఎంపీగా గెలిపించాలని కోరుతూ వీడియో సందేశం ఇచ్చారు. దీంతో కీలకమైన పోలింగ్ వేళ తన మద్దతు కుమార్తె షర్మిలకే అని స్పష్టంచేయడం హాట్‌టాపిక్‌గా మారింది.