YS Jagan | నటుడు పోసాని కృష్ణమురళిని బుధవారం రాత్రి హైదరాబాద్ రాయదుర్గంలోని ఆయన నివాసం నుంచి ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను ఈరోజు అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లె(Obulavaripalli) గ్రామ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోసానికి పోలీస్ స్టేషన్‌లోనే వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పీహెచ్‌సీ డాక్టర్ గురుమహేష్.. స్టేషన్‌కు చేరుకున్నారు. అరెస్ట్ సమయంలో తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని పోసాని చెప్పడంతోనే వైద్య పరీక్షల కోసం పోలీస్ స్టేషన్‌లోనే వైద్యుడిని పోలీసులు ఏర్పాటు చేశారు.
కాగా, పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) అరెస్ట్ ఘట్టం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చలకు తెరలేపింది. అధికారం అందడంతో తమను విమర్శించిన వారిపై ఎన్‌డీఏ(NDA) ప్రభుత్వం కక్ష తీర్చుకుంటుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని వైసీపీ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పోసాని అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆయన భార్యను మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) పరామర్శించారు. ఆమెకు ఫోన్ చేసి మాట్లాడారు. పోసాని అరెస్ట్‌ను జగన్ కూడా తీవ్రంగా ఖండించారు. పోసాని కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.