Union Budget 2023: కేంద్ర బడ్జెట్ ముంగిట్లో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుకుంది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2023-24 బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఈ బడ్జెట్ ప్రతులు సామాన్యులకు అందుబాటులో ఉండేవిధంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికోసం ప్రత్యేకంగా యూనియన్ బడ్జెట్ అనే పేరుతో వెబ్ సైట్, మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆర్థిక మంత్రి బడ్జెట్(Union Budget 2023) ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టగానే బడ్జెట్ ప్రతులను పీడీఎఫ్ రూపంలో వెబ్ సైట్, యాప్ లో అందుబాటులో ఉంచుతారు. బడ్జెట్ ప్రతులతో పాటు బడ్జెట్ ప్రసంగం, డిమాండ్ ఫర్ గ్రాంట్స్, ఫైనాన్స్ బిల్లులు, కేటాయింపులు సహా మొత్తం బడ్జెట్ కు సంబంధించిన డాక్యుమెంట్లను ఈ యాప్ లో అందుబాటులో ఉంచుతారు. డిజిటల్ ఇండియా స్పూర్థితో ఆర్థిక వ్యవహారాల శాఖ సూచనల మేరకు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఈ బడ్జెట్ యాప్ ను డిజైన్ చేసింది. ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉండే ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్ లలో అందుబాటులో ఉంది.