వ్యక్తిగత ప్రమాద బీమా తీసుకుంటున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!

0
92

ప్రమాదం..ఎప్పుడు ఏ రూపంలో ముంచుకొస్తుందో ఎవరం ఊహించలేము. అది ఖర్చుతో కూడుకున్నదైతే అప్పుడు పడాల్సిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. దగ్గరి వారు, బంధువులు, ఫ్రెండ్స్ ఇలా ఒకరొకరు సహాయం చేయకపోవచ్చు. అలాంటి సమయంలో ఈ ప్రమాద భీమా పాలసీలే కుటుంబాలను, ప్రాణాలను నిలబెడుతున్నాయి.

వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీని అయిదేళ్ల వారి నుంచి 70 ఏళ్ల వరకు ఉన్న వారికి ఇస్తారు. జీవిత, ఆరోగ్య బీమా పాలసీల తరహాలో వయసును బట్టి, ప్రీమియం మారదు. అన్ని వయసుల వారికీ ఒకే ప్రీమియం ఉంటుంది. అయితే, వ్యక్తుల ఆదాయం, వారికి ఎదురయ్యే ప్రమాదాల జాబితాను బట్టి, పాలసీ విలువ, ప్రీమియాన్ని నిర్ణయిస్తారు.

వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలు రెండు రకాలుగా తీసుకునే అవకాశం ఉంది. సాధారణ బీమా సంస్థలు ఈ పాలసీని ప్రత్యేకంగా స్టాండలోన్‌ పాలసీగా అందిస్తున్నాయి. జీవిత బీమా సంస్థలు అనుబంధ పాలసీగానూ దీన్ని ఇస్తున్నాయి. సాధారణ బీమా సంస్థలు అందించే పాలసీని ఏటా పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. జీవిత బీమా పాలసీతోపాటు తీసుకున్నప్పుడు దీర్ఘకాలిక ఒప్పందంగా ఉంటుంది. దాదాపు 104 వారాల దాకా పరిహారం ఇచ్చే ఏర్పాటు ఉంటుంది. పాలసీ తీసుకునేటప్పుడు ఈ విషయాన్ని పరిశీలించాలి.

వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ ప్రతి ఒక్కరికీ అవసరమనే చెప్పాలి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే యువతకు ఈ పాలసీ అత్యంత అవసరం. ప్రయాణాలు ఎక్కువగా చేసేవారు ఈ పాలసీని మర్చిపోకూడదు. టర్మ్‌ పాలసీతో పోల్చినా.. ప్రమాద బీమా పాలసీకి ప్రీమియం తక్కువే.