మొదట ఫ్రీగా ఇవ్వడం..ఆపై అందినకాడికి దండుకోవడం కార్పొరేట్ కంపెనీలకు అలవాటే. డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే.. ఇప్పుడు ఇదే బాట పట్టింది. ఇన్నాళ్లు ఉచితంగా అందించిన సేవలపై మెల్ల మెల్లగా బాదుడు షురూ చేస్తోంది. ఈ క్రమంలో మొబైల్ రీచార్జ్‌లపై ప్రాసెసింగ్ ఫీజులను వసూలు చేయడం షురూ చేసింది. రూ.50, అంతకు మించి విలువైన మొబైల్ రీఛార్జీలపై లావాదేవీకి రూ.1 నుంచి రూ.2 చొప్పున ఛార్జ్ చేస్తోంది. యూపీఐ సేవలపై రుసుము విధించడం మొదలుపెట్టిన సంస్థ ఫోన్‌పేనే కావడం విశేషం.
ఫోన్‌పే ఇప్పుడు రీచార్జ్‌లపై కూడా బాదుడు మొదలుపెట్టడంతో..ఇతర సంస్థలూ అదే బాట పట్టేలా కనిపిస్తున్నాయి. డిజిటల్ చెల్లింపుల్లో 40 శాతం వాటా ఫోన్‌పేదే. సెప్టెంబరులో 165 కోట్ల యూపీఐ లావాదేవీలను నిర్వహించిన రికార్డు సొంతం చేసుకుంది. మార్కెట్లో తిరుగులేదన్న నమ్మకం కుదరడంతో ఇప్పుడు.. కస్టమర్లను బాదే పని పెట్టుకుంది.