డీటీహెచ్ ఛార్జీలు డిసెంబరు నుంచి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. నెట్‌వర్క్ కంపెనీలు పాపులర్ టీవీ ఛానళ్ల ధరలు పెంచే యోచనలో ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. జీ, స్టార్, సోనీ, యాకామ్18 వంటి సంస్థలు కొన్ని టీవీ ఛానళ్లను వాటి బౌక్వెట్ నుంచి తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
ఈ క్రమంలో టీవీ వీక్షకులు 35-50 శాతం వరకు అదనంగా చెల్లించుకోవాల్సి రావొచ్చు. టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ కొత్త టారిఫ్ నిబంధనల అమలు నేపధ్యంలో ఈ మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు సమాచారం. ట్రాయ్ 2017 లో న్యూ టారిఫ్ ఆర్డర్ ఎన్‌టీఓ తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత ఎన్‌టీవో 2.0 కూడా 2020 జనవరి ఒకటిన వచ్చింది. ఇదే క్రమంలో అన్ని నెట్‌వర్క్ కంపెనీలు వాటి ధరలను సవరించుకున్నాయి. ఎన్‌టీఓ 2.0 ద్వారా టీవీ ప్రేక్షకులకు నచ్చిన ఛానల్ మాత్రమే వీక్షించే అవకాశం లభించింది. అంటే ఆయా నచ్చిన ఛానళ్లకు మాత్రమే డబ్బులు చెల్లించొచ్చు.
బౌక్వెట్‌లో అందించే ఛానళ్ల చార్జీలు సగటును నెలకు రూ. 15-రూ. 25 వరకు ఉంది. అయితే ట్రాయ్ ఈ చార్జీలను రూ.12కు తగ్గించింది. దీంతో నెట్‌వర్క్ కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. అందుకే పాపులర్ ఛానళ్లను బౌక్వెట్‌లో నుంచి తొలగించాలని చూస్తున్నారని తెలుస్తుంది.