సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సంస్థ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత సమాచారం రక్షణలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతుండటంతో కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఇక నుంచి ఫేస్‌బుక్‌లో ఫేషియల్ రికగ్నైషన్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఫేస్‌ప్రింటర్లను సైతం తొలగించనున్నట్లు ఫేస్‌బుక్ కంపెనీ మాతృసంస్థ ‘మెటా’ ఓ ప్రకటనలో తెలిపింది.
వ్యక్తిగత గోప్యతకు సంబంధించి ఫేస్‌బుక్‌లో ఫేస్ రికగ్నైషన్ సాంకేతికతతో ప్రమాదం పొంచి ఉందని ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే దీనికి సంబంధించి నియంత్రణ సంస్థలు దీని వినియోగాన్ని నియంత్రించే నిబంధనలు రూపొందించే ప్రక్రియలో ఉన్నట్లు ‘మెటా’ తెలిపింది.
అయితే ఈ మార్పులు ఈ నెలలోనే అమలులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత కొన్నిరోజులుగా ఫేస్‌బుక్ వ్యక్తిగత గోప్యతపై తరచూ విమర్శలపాలవుతోంది. పలుదేశాల్లో న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కుంది. ఇటీవల కంపెనీ మాజీ ఉద్యోగి ఫేస్‌బుక్ డాక్యుమెంట్లను లీక్ చేయడంతో ఫేస్‌బుక్ మాతృసంస్థకు కష్టాలు ఎక్కువయ్యాయి.